ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ ను మరోసారి పొడిగించిన కూటమి ప్రభుత్వం

  • ముంబై నటి కాదంబరి జెత్వానిని వేధించిన వ్యవహారంలో గున్నిపై కేసు
  • త్వరలో ముగుస్తున్న సస్పెన్షన్ గడువు
  • సెప్టెంబర్ 4వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఆరోపణలతో, వివాదాస్పద కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను మరోమారు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.


విశాల్ గున్ని సస్పెన్షన్‌ను సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించారు. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు విచారణ పూర్తిగా ముగిసే వరకు లేదా సెప్టెంబర్ 4 వరకు (ఏది ముందైతే అది) ఈ సస్పెన్షన్ నిబంధనలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసు 469/2024లో విశాల్ గున్నిపై విచారణ జరుగుతోంది.


విశాల్ గున్ని సస్పెన్షన్ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో.. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు జూన్ 12న ఉన్నత స్థాయి రివ్యూ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ కేసు తీవ్రతను పరిశీలించిన కమిటీ.. విశాల్ గున్ని ప్రస్తుతం ఉన్నత పోలీస్ హోదాలో ఉన్నందున, ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంటే కేసులోని కీలక సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఆయన విధుల్లో ఉంటే క్రిమినల్ విచారణ సజావుగా సాగకపోవచ్చని కమిటీ నివేదించింది. 


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం, వేధింపుల వ్యవహారంలో విశాల్ గున్నిపై తీవ్ర ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన గతంలో క్యాట్ (CAT)ను ఆశ్రయించగా.. క్యాట్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో, క్యాట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించిన సంగతి తెలిసిందే.


Vishal Gunni
AP Government
Kadambari Jethwani Case
IPS Suspension Extension
Andhra Pradesh Police News
Ibrahimpatnam Police Case

More Telugu News